Tuesday, April 29, 2014

Amadalavalasa Munisipality history,ఆమదాలవలస మునిసిపాలిటీ చరిత్ర



  • Amadalavalasa Municipality history, ఆమదాలవలస మునిసిపాలిటీ చరిత్ర.

 జిల్లాలో ఆమదాలవలస మునిసిపాలిటీది ఒక ప్రత్యేకత. మునిసిపాలిటీ ఏర్పాటైన తరువాత అక్కడ మునిసిపల్‌ చైర్మన్‌ పదవి కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతోంది. అది కూడా బొడ్డేపల్లి కుటుంబాన్నే వరిస్తోంది. జిల్లాలో పాలకవర్గ ఎన్నికలు జరిగిన ఇతర మూడు మునిసిపాలిటీలలో ఇటువంటి పరిస్థితులు లేవు. పలాసలో రెండుసార్లు ఇంతవరకూ ఎన్నికలు జరిగినా ఛైర్మన్‌ పదవిని రెండు వేరు వేరు సామాజిక కుటుంబాలకు చెందిన వారు చేపట్టారు. ఇక శ్రీకాకుళం, ఇఛ్చాపురం మునిసిపాలిటీలలో కూడా కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు పరిపాలనా పగ్గాలు ఆయా ఎన్నికల్లో చేపట్టాయి. అయితే ఆమదాలవలస మునిసిపాలిటీలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీకే గత రెండున్నర దశాబ్దాలుగా ప్రజలు పట్టంకడుతూ వస్తున్నారు. 1987 వరకూ మేజర్‌ పంచాయితీగా ఉన్న ఆమదాలవలసను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మునిసిపాలిటీగా చేసింది. అప్పట్లో శాసనసభ్యునిగా ఉన్న తమ్మినేని సీతారామ్‌ ఆమదాలవలసను మునిసిపాలిటీగా మార్పు చేయడంలో కీలకపాత్ర పోషించారు. మునిసిపాలిటీలో పరిసరప్రాంతాల పంచాయతీలను విలీనం చేసేందుకు ఆ పంచాయతీ నాయకులు అప్పట్లో అంగీకరించకపోయినప్పటికీ, కోర్టుల్లో తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో మునిసిపాలిటీకి 1988లో తొలిసారిగా పాలకవర్గ ఎన్నికలు నిర్వహించారు.

 రాజకీయంగా జిల్లాలోనే కాకుండా జాతీయస్థాయిలోనే గొప్ప గుర్తింపు పొందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు కుటుంబానికి ఆమదాలవలసలో ఉన్న ఆదరణ కారణంగా తొలిసారి మునిసిపల్‌ ఎన్నికల్లో రాజగోపాలరావు సోదరుడు, అప్పటికే ఆమదాలవలస సమితి అధ్యక్షునిగా అనుభవం ఉన్న బొడ్డేపల్లి వెంకటనర్సింగరావును భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. అంతే కాకుండా ఆ ఎన్నికల్లో మొత్తం 20 వార్డులకుగాను 14 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధులను గెలిపించారు. ఇద్దరు ఇండిపెండెంట్లను కూడా గెలిపించగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మునిసిపాలిటీలో కేవలం 4 వార్డులు మాత్రమే దక్కాయి. బొడ్డేపల్లి కుటుంబంపై ప్రజలకు ఉన్న అభిమానంతో పాటు, మునిసిపాలిటీలో తమ పంచాయితీలను చేర్పించారన్న ఆగ్రహంతో పరిసర ప్రాంతాలకు పంచాయితీల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే ఛైర్మన్‌గా ఎన్నికైన బొడ్డేపల్లి వెంకటనర్సింగరావు (వెంకటబాబు) రెండు సంవత్సరాలు కూడా కాకుండానే హఠాత్తుగా మరణించడంతో వైస్‌ఛైర్మన్‌గా ఉన్న స్థానిక ప్రైవేటు వైద్యుడు ఎల్‌.అప్పారావు మూడు సంవత్సరాలకు పైగా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. 1995లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బొడ్డేపల్లి రాజగోపాలరావు పెద్ద కోడలైన బొడ్డేపల్లి సత్యవతి (ప్రస్తుత ఎంఎల్‌ఎ) ఛైర్‌పర్శన్‌ అభ్యర్ధిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె దేశం అభ్యర్ధిపై 115 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో వార్టుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత రావడంతో అప్పట్లో వైస్‌ఛైర్మన్‌ పదవిని దేశం కౌన్సిలర్‌ బోర గోవిందరావు దక్కించుకున్నారు.

2000లో జరిగిన ఎన్నికల్లో కూడా రెండవసారి బొడ్డేపల్లి సత్యవతి దేశం అభ్యర్ధి తమ్మనేని గీతపై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ వార్డులను మళ్లి గెలుచుకోగలిగింది. తెలుగుదేశం ప్రభంజనం రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆ రెండు ఎన్నికల్లో కూడా బొడ్డేపల్లి సత్యవతి ఆమదాలవలస మునిసిపల్‌ ఛైర్‌పర్శన్‌గా గెలుస్తూ కాంగ్రెస్‌ పార్టీకి జిల్లాలో ఆశాదీపంగా కనిపిస్తూ వచ్చారు. 2004 అసెంబ్లి ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బొడ్డేపల్లి సత్యవతి పోటీచేయడం, ఆ ఎన్నికల్లో ఆమె గెలుపొందడంతో మునిసిపల్‌ ఛైర్‌పర్శన్‌ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో వైస్‌చైర్మన్‌గా ఉన్న కూన అప్పలనాయుడు మునిసిపల్‌ ఛైర్మన్‌గా దాదాపు సంవత్సర కాలం ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2005లో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో ఛైర్మన్‌ పదవి పరోక్షపధ్దతిలో ఎన్నిక కావలసి వుండటంతో ఆ ఎన్నికల్లో
శాసనసభ్యురాలు సత్యవతి కుమారుడైన బొడ్డేపల్లి రమేష్‌ కౌన్సిలర్‌గా పోటీచేశారు. అప్పటివరకూ ఉన్న 20 వార్డులు పునర్విభజనలో 23 వార్డులకు పెరిగాయి. ఆ ఎన్నికల్లో బొడ్డేపల్లి రమేష్‌తో పాటు మెజార్టీ సంఖ్యలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు గెలుపొందడంతో రమేష్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అంతవరకూ మునిసిపాలిటీలో నాలుగుసార్లు ఎస్‌టి వార్డులనుంచి ఎన్నికవుతూ వస్తున్న గేదెల రాములును వైస్‌ఛైర్మన్‌గా ఎంపిక చేశారు. 2010 సెప్టెంబర్‌ 30తో ఆ కౌన్సిల్‌ పదవీకాలం ముగియడంతో మూడు సంవత్సరాలుగా ప్రత్యేకాధికారుల పాలనలో మునిసిపాలన సాగుతూ వస్తోంది. మరి ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఏపార్టీకి పట్టం కడతారన్నది అంచనాలకు అందడంలేదు. 2005 వరకూ కేవలం రెండు పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాత్రమే పోటీ అనేది ఉండేది. ఇప్పుడు మూడు పార్టీలు మునిసిపాలిటీని దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌, దేశం పార్టీలతో పాటు ఈసారి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా పోటీపడుతోంది. అసెంబ్లి, లోక్‌సభ ఎన్నికల కంటే ఇంచుమించు నెల రోజుల ముందుగా మునిసిపల్‌ ఎన్నికలు జరుగుతుండటంతో మూడు పార్టీలకు కూడా మునిసిపల్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో మునిసిపాలిటీ ఎన్నికలు ఈ మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెటలు పట్టిస్తున్నాయి. మరి ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కడతారో .

--శ్రీకాకుళం, మార్చి 8 (కెఎన్‌ఎన్‌ బ్యూరో):
  • ===========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment