Sunday, April 20, 2014

History of Andhrapradesh Assembly Elections,ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చరిత్ర





ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి.

1957 అసెంబ్లీ ఎన్నికలు
1956లో హైదరాబాద్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు , ఆంధ్ర రాష్ట్రం కలిసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. 1957లో అసెంబ్లీ ఎన్నికలు కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే నిర్వహించారు. మొత్తం 104 నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ 68 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ మెజార్టీ ఉండటంతో ఇరు ప్రాంతాలకు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగారు.నీలం సంజీవరెడ్డి 1960 వరకు, దామోదర సంజీవయ్య 1962 వరకు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

1962 అసెంబ్లీ ఎన్నికలు
1962లో జరిగిన మూడో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 300 నియోజకవర్గాలకు 988 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 300 స్థానాల్లోనూ పోటీ చేసి 177 స్థానాలు గెలుపొంది భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమ్యూనిస్టు పార్టీ 51 స్థానాలు గెలుపొంది ప్రతిపక్షస్థానంలో నిలిచింది. ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి 1964 వరకు, తర్వాత 1967 వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు.

1967 అసెంబ్లీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌ నాలుగో అసెంబ్లీ ఎన్నికలు 1967లో జరిగాయి. ఈ ఎన్నికల్లో 287 నియోజకవర్గాలకు 1067మంది అభ్యర్థులు పోటీ చేశారు. 287 నియోజకవర్గాలకు పోటీచేసిన కాంగ్రెస్‌ 165 స్థానాలు కైవసం చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు 401 మంది పోటీ చేయగా 68మంది గెలుపొందారు. స్వతంత్ర పార్టీ 90 స్థానాల్లో పోటీ చేసి 29స్థానాల్లో విజయం సాధించింది.
ముఖ్యమంత్రి- కాసు బ్రహ్మానందరెడ్డి


1972 అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ వరుసగా అయిదోసారి భారీ మెజార్టీతోప్రభంజనం సాధించింది. 287 నియోజకవర్గాలకు 1004మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 219 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయదుందుభి మోగించింది. ఏ పార్టీకి కనీసం రెండంకెల్లో సీట్లు సైతం దక్కలేదు. స్వతంత్ర అభ్యర్థులు మాత్రం 57మంది గెలుపొందారు. పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రి అయినప్పటికీ సంవత్సరంలోనే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 1973 జనవరిలో రాష్ట్రపతి పాలన విధించారు. అదే సంవత్సరం డిసెంబర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తేసిన తర్వాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టారు.

1978 అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఎన్నికల్లో 294 నియోజకవర్గాలకు 870 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఇందిరా కాంగ్రెస్‌ పార్టీ (ఐఎన్‌సీ(ఐ)) 290స్థానాల్లో పోటీ చేసి 175 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ పార్టీ 257 స్థానాలకు పోటీ చేసి 30 స్థానాలు, జనతా పార్టీ 270స్థానాల్లో పోటీ చేసి 60 స్థానాలు గెలుపొందాయి. 1978 నుంచి 1980 వరకు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత 1982 వరకు టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. తర్వాత భవనం వెంకటరామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కొద్ది కాలానికి ముఖ్యమంత్రులుగా ఉన్నారు.

1983 అసెంబ్లీ ఎన్నికలు
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలుపొందింది. 294 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ 290 నియోజకవర్గాలకు పోటీచేసి 201 సీట్లు సాధించి ఘన విజయం పొందింది. కాంగ్రెస్‌ పార్టీ 294 సీట్లకు పోటీ చేసి 60సీట్లు సాధించింది. నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అయ్యారు. 1984లోనే నాదెండ్ల భాస్కరరావు 31రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు.


1985 అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఎన్నికల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా 250స్థానాల నుంచి పోటీ చేసిన తెదేపా 202 స్థానాలు గెలుపొంది భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఎన్టీ రామారావు మళ్లీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. కాంగ్రెస్‌ 290 నియోజకవర్గాల్లో పోటీ చేసి 50 స్థానాలకు పరిమితమయ్యింది.

1989 అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఎన్నికల్లో తెదేపా పరాజయం పాలయ్యింది. 294 అసెంబ్లీ నియోజకర్గాలకు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్‌ 287స్థానాలకు పోటీ చేసి 181 స్థానాలు కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 241 స్థానాల్లో పోటీ చేసి 74స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఏర్పాటుచేసి మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. 1990-92లో నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి, 1992- 94 వరకు కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.

1994 అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా తెదేపా 251స్థానాల నుంచి పోటీ చేసి 216 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ 294సీట్లకు పోటీచేసి కేవలం 26 స్థానాల్లో గెలుపొందింది. 1994-95వరకు ఎన్టీ రామారావు, 1995 నుంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.

1999 అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 294 నియోజకవర్గాల్లో తెదేపా 269స్థానాల నుంచి పోటీచేసి 180 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 293 స్థానాల నుంచి పోటీ చేసి 91స్థానాల్లో గెలుపొందింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.

2004 అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. 294 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ 234స్థానాల నుంచి పోటీ చేసి 185స్థానాల్లో గెలుపొందింది. తెదేపా 267స్థానాల నుంచి పోటీ చేసి 47స్థానాలకే పరిమితమయ్యింది. కాంగ్రెస్‌ అత్యధిక మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటు చేసింది. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

2009 అసెంబ్లీ ఎన్నికలు
ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ గెలుపొందింది. 294 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ 294 స్థానాల నుంచి పోటీచేసి 156స్థానాల్లో గెలుపొందింది. తెలుగుదేశం పార్టీ 225స్థానాల నుంచి పోటీ చేసి 92స్థానాల్లో గెలుపొందింది. 2009లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2009 సెప్టెంబర్‌లో వైఎస్‌ మరణం తర్వాత 2009-10 లో కొణిజేటి రోశయ్య, 2010-14 వరకు ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేశారు.


  • Courtesy with Eenadu News paper April 2014
  • =====================================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment