Tuesday, November 25, 2014

Defeated even though party changed,గోడ దూకినా... తప్పని ఓటమి.












గోడ దూకినా... తప్పని ఓటమి! -- న్యూస్‌టుడే - రాజాం, టెక్కలి
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎంతో మంది నాయకుల రాజకీయ జీవితాలను తలకిందులు చేశాయి. పార్టీలు మారి పోటీ పడ్డ నేతల్లో అత్యధికులకు చేదు ఫలితాలే ఎదురయ్యాయి. అటు వైకాపాలోనూ గెలిచిన అభ్యర్థుల్లో సంతోషమే లేదు. పార్టీ అధికారంలోకి రాలేకపోయిందన్నది వారి బాధ.
రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారటంతో చాలామంది పార్టీలు మారి టికెట్లు దక్కించుకున్నారు. ఇందులో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలినవారు ఓటమిపాలయ్యారు. మరో అయిదేళ్ల వరకు రాజకీయ భవితవ్యం ఏమిటో తెలియక సతమతమవుతున్నారు. కేడర్‌ను ఎలా నిలుపుకోవాలో అంతుబట్టడం లేదని ఆవేదన చెందుతున్నారు. వైకాపా నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఓటమి పాలవడంతో.. వ్యక్తిగతంగానూ విజయం సాధించక, రాష్ట్రంలోనూ అధికారం లేకపోవడంతో అయిదేళ్లూ ఎలా నెట్టుకు రావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
* ఇచ్ఛాపురం నుంచి వైకాపా తరఫున బరిలోకి దిగిన నర్తు రామారావు ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈసారి పార్టీ మారినా కలిసిరాలేదు. పైగా తెదేపా చేతిలో భారీ తేడాతో ఓడిపోవటం ఆయన వర్గీయులకు షాకిచ్చింది. ఇప్పుడు రాజకీయంగా నెట్టుకు రావడం కత్తిమీద సాములా మారింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాల్‌ లల్లూ కొంతవరకు ఓట్లను రాబట్టగలిగినా.. భవిష్యత్తు ఏమిటన్నది ఆయన వర్గీయుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది.
* పలాస నుంచి వైకాపా తరఫున బరిలోకి దిగిన వజ్జ బాబూరావు కాంగ్రెస్‌ నుంచి వైకాపాలోకి మారి టికెట్‌ తెచ్చుకున్నారు. చివరకు ఓటమి పాలయ్యారు. పలాస పురపాలకసంఘం సైతం చేజారిపోయింది. దీంతో క్యాడర్‌ మొత్తం అయోమయంలో ఉంది. 2009 ఎన్నికల్లో ప్రరాపా తరఫున పోటీ చేసిన వంక నాగేశ్వరరావు ఈసారి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.
* టెక్కలి నుంచి వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌ గత ఎన్నికల్లో ప్రరాపా తరఫున పోటీ చేశారు. అచ్చెన్నాయుడు రాజకీయ వ్యూహాల ముందు శ్రీనివాస్‌ నిలవలేక పోయారు. పార్టీ మారి టికెట్‌ దక్కించుకున్నా.. ఫలితం లేకపోయింది. రాజకీయ మనుగడపై ఆయన అనుచరుల్లో చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భర్త రామ్మోహన్‌రావు టెక్కలి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసినా ఫలితం లేకపోయింది. కనీస స్థాయిలో పోటీ ఇవ్వలేక 1,849 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
* ఆమదాలవలస నుంచి వైకాపా తరఫున బరిలోకి దిగిన తమ్మినేని సీతారాందీ ఇదే పరిస్థితి. తెదేపాలో సీనియర్‌ నేతగా, మాజీ మంత్రిగా తిరుగులేని గుర్తింపు పొందిన ఆయన 2009లో ప్రజారాజ్యంలో చేరి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. తిరిగి తెదేపా గూటికి చేరినా.. అంతలోనే మళ్లీ వైకాపాలోకి వెళ్లిపోయారు. బరిలోకి దిగినా తెదేపా అభ్యర్థి కూన రవికుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినట్లు కనబడినా.. సార్వత్రిక ఎన్నికల్లో సీతారాం చేతులెత్తేశారు.
* శ్రీకాకుళం నుంచి వైకాపా తరఫున బరిలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు ఘోర పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన వైకాపాలో చేరిన తరువాత రాజకీయ భవితవ్యం పూర్తిగా మారిపోయింది. మొదటిసారి పోటీకి దిగిన మహిళ గుండ లక్ష్మీదేవి చేతిలో భారీ తేడాతో ఓడిపోయారు. ఈయన అనుచరుల్లో చాలామంది వేరే ఆలోచనల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు తెదేపా నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
* నరసన్నపేట నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మాన కృష్ణదాసు మొదట్లో కాంగ్రెస్‌ వాదే. వైపాకాలోకి వచ్చాక జిల్లా కన్వీనరుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఉప ఎన్నికలో గెలిచిన ఆయన సార్వత్రిక ఎన్నికలొచ్చేసరికి మెజారిటీని నిలుపుకోలేకపోయారు.
* ఎచ్చెర్లలో వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి వచ్చినవారే. చివరికి తెదేపా అభ్యర్థి కిమిడి కళావెంకటరావు చేతిలో ఓటమి తప్పలేదు. కళావెంకటరావు ఇదే నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో ప్రరాపా అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు. తాజాగా తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి పట్టు నిలుపుకున్నారు.
* పాతపట్నం నుంచి తెదేపా అభ్యర్థిగా బరిలోకి దిగిన శత్రుచర్ల విజయరామరాజు అంతకుముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. చివరిలో పార్టీ మారినా.. గట్టిపోటీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన కలమట వెంకటరమణ ఈసారి వైకాపా తరఫున పోటీ చేశారు. 2009లో ప్రరాపా తరఫున పోటీ చేసిన పాలవలస కరుణాకర్‌ ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి కేవలం 1,506 ఓట్లనే తెచ్చుకోగలిగారు.
* పాలకొండ నుంచి వైకాపా తరఫున విజయం సాధించిన వి.కళావతి 2009లో ప్రరాపా అభ్యర్థిగా ఓడిపోయారు.
* రాజాం నుంచి వైకాపా అభ్యర్థిగా గెలిచిన కంబాల జోగులు 2009 ఎన్నికల్లో ప్రరాపా అభ్యర్థిగా ఓడిపోయారు. ఈసారి అదృశ్య శక్తుల సహకారంతో విజయ తీరాలకు చేరుకోలిగారు.
ఆర్థికంగా ఇబ్బందే
ఓటమి పాలైన చాలా మంది అభ్యర్థులు ఆర్థికంగానూ చితికిపోయారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి డబ్బు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. కోట్ల కట్టలను మంచి నీళ్లలా వెదజల్లారు. పార్టీ నిధి అందించినా.. సొంత డబ్బులు చాలా వరకు ఖర్చు చేసినట్లు ఓటమిపాలైన పలువురు అభ్యర్థులు 'న్యూస్‌టుడే'తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పార్టీ ఖర్చు చేస్తోందని మరో పార్టీ.. ఇలా అభ్యర్థులను సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే బ్లాక్‌మెయిల్‌ చేసి అధికంగా ఖర్చు చేయించారన్నది వీరి ఆక్రోశం.


  • ======================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment