Monday, April 28, 2014

2014 Educated contesting for A.P.Legislatures(Assembly & Parliment),చట్ట సభలకు చదువుకున్నవారు

  •  

  •  
ఒకప్పుడు రాజకీయాల్లో చదువుకున్న వారి సంఖ్య తక్కువే. పెద్ద చదువులు చదివిన వారు మరీ తక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సాధారణ చదువులు, పీజీలు చేసినవారే కాకుండా వృత్తివిద్యా కోర్సులు, పీహెచ్‌డీలు పూర్తిచేసిన వారు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి శుభసూచకం. ఆహ్వానించదగ్గ అంశం. వీరి రాకతో అయినా ప్రజాస్వామ్యం దశ దిశ మారుతుందన్న ఆశ కలుగుతోంది. రాష్ట్రంలో తెదేపా, కాంగ్రెస్‌, వైకాపాల నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఉన్నత విద్య అభ్యసించిన వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. నామినేషన్లలో పేర్కొన్న విద్యార్హతల ప్రకారం అభ్యర్థుల్లో 40 శాతం మంది ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంఫిల్‌, పీహెచ్‌డీ వంటి కోర్సులు చేశారు. పదో తరగతి వరకు చదివినవారి సంఖ్య దాదాపు 10 శాతానికి మించక పోవడం ఆసక్తికరం.
బరిలో ఉన్నవారిలో చాలామంది రాజకీయాల్లో ఉన్నవారే అయినా ఈ దఫా తొలిసారిగా పోటీచేస్తున్నవారి సంఖ్యకూడా గణనీయంగానే ఉంది. సాధారణ డిగ్రీలతో చిన్నచిన్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నవారు మొదలుకుని.. స్టెతస్కోప్‌తో రోగుల నాడి పట్టే వైద్యులు.. బీఈడీ, ఎంఈడీ విద్యార్హతలతో బోధన రంగంలో టీచర్లు, ప్రొఫెసర్లుగా ఉన్నవారు.. ఐఏఎస్‌లుగా పదవీ విరమణ చేసిన వారి వరకు ఇలా పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. మరో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ కూడా చేసిన ఆయన కుప్పం శాసనసభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. బొబ్బిలి శాసనసభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా పోటీచేస్తున్న టి.లక్ష్మునాయుడు బ్రిటన్‌లో బీటెక్‌, ఎంబీఏ చదివారు. తాడికొండ శాసనసభ నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేస్తున్న తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఎంఎస్సీ, ఎంఈడీ, ఎల్‌ఎల్‌బీ అభ్యసించారు. శాసనసభ, లోక్‌సభ అభ్యర్థుల్లో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చేసినవారు 107 మంది ఉన్నారు. పీజీ కోర్సులు చేసిన, ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేసిన వారు మరో 105 మందిని కలిపితే.. 212 మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో వీరి సంఖ్య సుమారుగా 40శాతంపైమాటే.
* పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న అభ్యర్థుల సంఖ్య 57. వీరిలో వైకాపా నుంచి 22, తెదేపా నుంచి 21, కాంగ్రెస్‌ నుంచి 14 మంది ఉన్నారు. కొంతమంది అభ్యర్థుల విద్యార్హతలు 7, 8 తరగతి వరకు మాత్రమే ఉన్నాయి.

* ఇంటర్‌, డిగ్రీ విద్యార్హత ఉన్నవారి సంఖ్య మూడు పార్టీల అభ్యర్థులను కలిపితే 249 మంది. వీరిలో తెదేపా నుంచి 86 మంది.. వైకాపా నుంచి 84, కాంగ్రెస్‌ తరఫున 79 మంది పోటీలో ఉన్నారు.

* ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి వృత్తివిద్యా కోర్సులతో ఉన్నత విద్య అభ్యసించిన అభ్యర్థులు.. 107 మంది కాగా, వీరిలో కాంగ్రెస్‌ నుంచి 41, వైకాపా నుంచి 39, తెదేపా నుంచి 27 మంది ఉన్నారు.

* ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంఫిల్‌, పీహెచ్‌డీ.. ఉన్నత విద్య అభ్యసించినవారు 105 మంది. ఇందులో కాంగ్రెస్‌ నుంచి 38 మంది ఉన్నారు. ఆ తర్వాత తెదేపా నుంచి 34 మంది, వైకాపా నుంచి 33 మంది ఉన్నారు.

  • Courtesy with : ఈనాడు హైదరాబాద్‌- 28-04-14.
  • ============================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment