జిల్లాలో తెదేపా రాజకీయాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎర్రన్నాయుడి దుర్మరణం తరువాత ఆయన తనయుడు 27 సంవత్సరాల రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన బీటెక్, ఎంబీఏ పట్టభద్రుడు. తండ్రి మరణం తరువాత ప్రజల్లో సానుభూతి ఉన్నా ఫిబ్రవరిలో రామ్మోహన్ నాయుడు 23 రోజుల పాటు ఏడు వందల కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేసి సొంత ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఉద్దానం మూత్రపిండాల సమస్య, సాగునీటి వనరుల సద్వినియోగం, వలసల నివారణ, యువతకు ఉపాధి అవకాశాలు, మత్స్యకారుల ప్రగతి వంటి అంశాలపై తానేం చేయదలచుకున్నారో ప్రచారం చేస్తున్నారు. భాజపాతో పొత్తులో భాగంగా తొలుత కేటాయించిన నరసన్నపేట, తరువాత కేటాయించిన ఇచ్ఛాపురం అసెంబ్లీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులను నిలబెట్టడానికి చంద్రబాబు, వెంకయ్యనాయుడులను ఒప్పించడం ద్వారా నియోజకవర్గంపై పట్టు సాధించారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా కిల్లి కృపారాణి బరిలో ఉన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ శ్రేణులు పార్టీ నుంచి బయటకెళ్లిపోయాయి. సోంపేట థర్మల్ కేంద్రానికి అనుమతులను రద్దు చేయించడానికి కిరణ్ సర్కారు చివరి కాలంలో కృపారాణి ప్రయత్నించినా జీవో తేలేకపోయారు. సొంత సామాజికవర్గంపైనే ఆశలు పెట్టుకున్నారు. వైకాపాలోని అసంతృప్తులను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పలాస ఎమ్మెల్యే జగన్నాయకులతో చర్చలు జరుపుతున్నారు.తన హయాంలో చేసిన అభివృద్ధి పనులనే ప్రచారాస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు.
వైకాపా తరఫున జడ్పీ మాజీ ఛైర్మన్ పి. రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతి పోటీలో ఉన్నారు. ఈమె రాజకీయాలకు కొత్త. జిల్లాను వదిలి 20 సంవత్సరాలైంది. ఢిల్లీలో నివసిస్తారు భర్త నాగభూషణ్‌రావు ఐఎఫ్‌ఎస్ అధికారి. తన సామాజికవర్గ ఓట్లపై నమ్మకంతో పోటీ పడుతున్నా అవి గెలుపును నిర్దేశించే స్థాయిలో లేవు.
శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆరుసార్లు విజయం సాధించారు. 1952, 1957, 1962, 1971, 1977, 1980 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రైతు బాంధవుడిగా పేరొందిన ఆచార్య ఎన్.జి.రంగా 1967 ఎన్నికల్లో రాజగోపాలరావును 52,644 ఓట్ల తేడాతో ఓడించారు. రాజగోపాలరావు అనంతరం దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు నాలుగుసార్లు 1996, 1998, 1999, 2004 ఎన్నికల్లో నెగ్గి పార్లమెంటులో అడుగుపెట్టారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా పనిచేసి జిల్లా నుంచి తొలి కేంద్రమంత్రిగా ఘనతను సొంతం చేసుకున్నారు.
Courtesy with --న్యూస్‌టుడే పాతశ్రీకాకుళం.
- ==========================
No comments:
Post a Comment