Wednesday, August 7, 2013

Panchayat council Duties-powers,పంచాయతీ పాలకవర్గాల అధికారాలు-విధులు


 

  •  
కొత్త పాలకవర్గాల కొలువు 02-08-2013-నేటి నుంచి బాధ్యతలు స్వీకరణ-సగం మందికి పైగా వనితలే.

 Srikakulam జిల్లా వ్యాప్తంగా 1097 మంది సర్పంచిలు కొలువు దీరనున్నారు. రెండేళ్లగా పాలకవర్గాలు లేకపోవడంతో పల్లెలకు నిధులను ప్రభుత్వాలు నిలిపేశాయి. నిలిచిపోయిన నిధులన్నీ సమకూరనున్నాయి. ఇక పల్లెల్లో ప్రగతి పూలు పూయించాల్సింది సర్పంచిలే. గ్రామాల్లోని సమస్యలు, విధులు, నిధుల గురించి సర్పంచిలు తెలుసుకొని ముందడుగు వేస్తేనే పల్లెల ప్రగతి సాధ్యం.

ఏడేళ్ల తరువాత పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో సర్పంచిలను ఎన్నుకోవడానికి పల్లె జనం పోటీపడ్డారు. 90శాతం వరకు పోలింగ్‌ నమోదవడమే ఇందుకు కారణం. ఇక జనం ఆశలు, ఆశయాలు నెరవేర్చాల్సిన బాధ్యత వీరిపై ఉంది. జిల్లాలో 1,095 పంచాయతీలకు గాను ఏకంగా 221 మంది సర్పంచిలను సిక్కోలు జనం ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. మిగిలిన 870 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మొత్తం సర్పంచిలు, ఇతర పాలకవర్గ సభ్యులు శుక్రవారం కొలువు తీరనున్నారు. ఈసారి పురుషుల కంటే మహిళా సర్పంచిలు అధికంగా కొలువు దీరడం ప్రత్యేకత సంతరించుకుంటోంది. 550 మందికి పైగా మహిళా సర్పంచిలు పల్లెలకు ప్రథమ పౌరులుగా సేవలు అందించనున్నారు.

గ్రామసభలకు అధికారం
పంచాయతీల్లో గ్రామసభల్లో నిర్ణయమే అంతిమం! ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు సభల్లో తెలియజేసి అర్హులను ఎంపిక చేసే బాధ్యత గ్రామసభదే. అందుకే ప్రతీ పంచాయతీలో సభలు ఏర్పాటు చేస్తూ పల్లెల్లో సమస్యలు తెలుసుకోవాలి. ఇక్కడ చేసిన తీర్మాణాలు అమలు చేయాలి. పంచాయతీరాజ్‌ చట్టం 1994 ప్రకారం ప్రతీ పంచాయతీలో సంవత్సరానికి కనీసం 4గ్రామసభలు ఏర్పాటు చేయాలి. పంచాయతీ సమావేశాలు కూడా నిర్ణీత గడువులోగా నిర్వహించాలి. కనీసం 90రోజులకు ఒక పంచాయతీ సమావేశం నిర్వహించాలి. సమావేశంలో చేసిన తీర్మాణాలు ఎమ్పీడీవో కార్యాలయానికి పంపాలి. గ్రామసభలకు పంచాయతీలకు ప్రథమ పౌరుడు సర్పంచే. ఎన్నికల్లో సర్పంచిగా ఎన్నికైనప్పటి నుంచి పదవీకాలం పూర్తయ్యే వరకు ప్రథమ పౌరుడుగా కొనసాగుతారు. గ్రామాల్లో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రొటోకాల్‌ ప్రకారం సర్పంచే సభాధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇలా ఎవరి సభలు గ్రామాల్లో జరిగినా సర్పంచి అధ్యక్షతనే జరుగుతాయి. ప్రజాప్రతి నిధుల్లో చెక్‌పవర్‌ ఉన్న ఏకైక వ్యక్తి కూడా సర్పంచ్‌గానే చెప్పుకోవచ్చు. గ్రామస్థాయిలో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకపాత్ర ఇతనిదే. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలు, సర్పంచికి అధికారులు, విధులు, నిధులు కట్టబెట్టింది. కాని చాలా వరకు సర్పంచిలు వీటిని అమలు చేయడం లేదు. కనీస స్థాయిలో అవగాహన లేకపోవడమే దీనికి కారణం.

36 దస్త్రాలు తప్పనిసరి
* గ్రామపంచాయతీలో 36 రకాల దస్త్రాలు నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ నిర్వహణకు సంబంధించి ప్రతీ అంశం ఇందులో పొందుపర్చాలి. 1994 ప్రకారం ప్రతీ పంచాయతీలో ఈరికార్డుల నిర్వహణ తప్పనిసరి.

* 1ఇంటి పన్ను, 2పంచాయతీ ఆస్తులు, 3జనన, 4మరణ, 5సిబ్బంది హాజరు, 6సిబ్బంది వేతనాలు, 7డివిజన్‌ రిజిస్టర్‌, 8ఇంటిపన్నుల డిమాండ్‌ పుస్తకం, 9నగదుపుస్తకం, 10లైసెన్సు జారీ పుస్తకం, 11స్టాకు రిజిస్టరు, 12కొనుగోలు రిజిస్టరు, 13చెక్‌ జారీ, 14బడ్జెట్‌, 15వేలం అనుమతులు, 16నోటీసుల జారీ, 17రసీదు, 18ఆడిట్‌, 19రోజువారీ లెక్కల పుస్తకం, 20సమావేశాల మినిట్స్‌ పుస్తకం, 21సభ్యుల హాజరు పుస్తకం, 22అజెండా రిజిస్టరు, 23గ్రామసభ నిర్వహణ రికార్డులు, 24కమిటీలతో పర్యవేక్షణ 25పంచాయతీల్లో ఆర్థిక వనరులు 26మౌలిక సదుపాయాల కార్యాచరణ 27ప్రభుత్వం నుంచి సమకూరుతున్న నిధులు -తదితర 36 రకాల దస్త్రాలు పంచాయతీ కార్యాలయంలో ఉండాలి

కమిటీలతో పర్యవేక్షణ
* పంచాయతీల్లో అయిదు రకాల కమిటీలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌చట్టం 1994 నిర్దేశించింది. జీవోఎంఎస్‌ 174 ప్రకారం గ్రామాల అభివృద్ధి, ఉన్న వనరులు సక్రమంగా వినియోగించుకోవడం ఈకమిటీల బాధ్యత

* కమిటీలకు సర్పంచి ఛైర్మన్‌గాను, అయన అందుబాటులో లేకపోతే ఉప సర్పంచి అధ్యక్షుడుగా ఉంటారు

ఇవీ బాధ్యతలు
పనులు, మౌలిక సదుపాయాల కార్యాచరణ కమిటీ:గ్రామాల్లో అవసరమైన పనులు గుర్తించడం, మౌలిక సదుపాయాల కల్పనకు కమిటీ చర్యలు చేపట్టాలి.
ఆర్థిక, ప్రణాళిక కార్యాచరణ కమిటీ:పంచాయతీల్లో ఆర్థిక వనరులు, ప్రభుత్వం నుంచి సమకూరుతున్న నిధులు, వీటి వినియోగం, ప్రణాళికలు, అమలు బాధ్యత ఈకమిటీ చూడాల్సి ఉంటుంది.
ఉపాధి కల్పన, స్వయం సహాయక బృందాల కార్యాచరణ కమిటీ:గ్రామాల్లో అవసరమైన పనులు గుర్తించడం, ప్రజలకు ఉపాధి కల్పించడం, స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడం వంటివి ఈకమిటీ చేయాల్సి ఉంటుంది.
సహజవనరుల యాజమాన్య కార్యాచరణ కమిటీ:అన్నింటికన్నా కీలకమైన బాధ్యతలు ఈకమిటీదే. సిక్కోలులో ప్రధాన రంగం వ్యవసాయం. పల్లెల్లో వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేయాలి. ఉద్యానవనాల పెంపకంలో దోహదపడాలి. నీటి సంరక్షణ, పశుపోషణ, మత్స్య సంపద వంటి వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది.
మానవ వనరులు, కార్యాచరణ కమిటీ:మానవ వనరుల అభివృద్ధి కమిటీ బాధ్యత, విద్య, ఆరోగ్యం, మాతాశిశుసంక్షేమం వంటివి పల్లె ప్రజలకు పూర్తి స్థాయిలో అందించాల్సిన బాధ్యత ఈకమిటీదే.

ఇవి కీలకం
పారిశుద్ధ్యం : పల్లెల్లో పారిశ్ధ్యుం అత్యంత కీలకమైనది. ఆరోగ్యంతో ఇది ముడిపడి ఉంటుంది. ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. రూ.10వేల వరకు సమకూర్చుకుంటున్నా జిల్లాలో ప్రగతి నత్తనడకన సాగుతోంది.
మద్యపాన నిషేధం:పల్లె బతుకులను పీల్చి పిప్పిచేస్తున్నది మద్యమే. జిల్లాలో 27లక్షల మంది జనాభా ఉండగా ఏడాదికి రూ.437.69 కోట్లు వరకు మద్యపానానికే తగలేస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారుల అంచనా ప్రకారం ఏటా మద్యం ఆదాయం గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
పారదర్శకత:పరిపాలనలో పారదర్శకత అత్యవసరం. ప్రతీ పనికీ ప్రజలకు జవాబు దారీతనంగా ఉండాలి.

విద్య : సమాజాభివృద్ధిలో కీలకం విద్యే. ఎక్కడైతే అక్షరాస్యత శాతం మెరుగవుతుంతో అక్కడ అభివృద్ధి, ఆదర్శ సమాజం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక, శారీరక, మానసిక, సామాజిక, నైతిక విలువలు వెలికి తీయగల శక్తి విద్యకే సాధ్యం.

అభివృద్ధి : పల్లెల్లో వలసలు పెరిగిపోతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా పట్టణాలు విస్తరించడానికి ఇదే కారణం. పేదలు ఆర్థికంగా అభివృద్థి చెందక పోవడమే దీనికి కారణం. రాజ్యంగంలోని 11వ షెడ్యూలులో ప్రకటించిన 29 అంశాలను పంచాయతీరాజ్‌ సంస్థలకు బదలాయించి, నిధులు కేటాయించే అంశాలు వేగవంతం కాకపోవడమే ఈదుర్గతికి కారణం.

మహిళా సాధికారత : మహిళా సాధికారత అత్యవసరం. రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలి. స్థానిక సంస్థల్లో వీరికి 50శాతం రిజర్వేషన్లు అమలు కావడంతో పురుషులకన్నా మహిళలే అధికంగా సర్పంచిలుగా ఎన్నికయ్యారు. వీరు సేవల్లో ఏమాత్రం సామర్థ్యం నిరూపించుకుంటారన్నది వచ్చే అయిదేళ్లలో తేలనుంది.

ఆర్థిక వననుల పెంపు : పంచాయతీలు కేవలం ప్రభుత్వం ఇచ్చే వనరులపైనే అభివృద్ధి సాధించాలంటే సాధ్యం కాదు. సొంత ఆదాయవనరులు పెంచుకొనేందుకు ప్రయత్నించాలి. చాలా పంచాయతీల్లో ఇంటి పన్నులు కూడా వసూలు కాని దుర్గతి నెలకొంది. ఇంటి పన్నులు వసూలు చేస్తే ఓట్లకు గండి పడుతుందన్నదే నేతల ఆలోచన. ఇంటినిర్మాణానికి ప్లాను అనుమతి, లేఅవుట్లు, ఇతర వాటి నుంచి ఆర్థిక వనరులు పెంచుకొనే వీలుంది.

తాగునీరు : జిల్లాలో తాగునీటి సమస్య అంతా ఇంతా కాదు. ప్రతీ పల్లెలోనూ వసవి వచ్చిందంటే చాలు గుక్కెడు నీటికి మహాయజ్ఞమే. జిల్లాలో 27 లక్షల మంది జనాభా ఉంటే 12.16 లక్షల మంది తాగునీటికి నోచుకోవడం లేదని తేలింది. మరో 375 పల్లెల్లో రోజుకు ఒకొక్కరికి కేవలం 10 లీటర్లు నీరు మాత్రమే అందుతోంది. సర్పంచిలు ప్రధానంగా దృష్టి సారించాల్సిన సమస్య ఇది.

ఇవీ సమస్యలు--
* గ్రామ పంచాయతీ ప్రజలకు పారిశుద్ధ్యం, విద్యుత్‌ సౌకర్యం, అంటువ్యాధుల నివారణ, తాగునీటి సరఫరా, రహదారి సౌకర్యం తదితర సేవలు అందించాల్సిన అవసరం ఉంది.
* పంచాయతీ ఆధీనంలో ఉన్న రహదారులు భవనాలు మరమ్మతులు నిర్వహించాలి.
* వర్షపునీరు, మురుగునీరు ప్రవహించేందుకు వీలుగా కాలువలు తవ్వించి వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలి.

* వీధులను శుభ్రపర్చటం, చెత్తకుప్పలను, పిచ్చిమొక్కలు, పొదలు, అడవిమొక్కలు, నాగజముడు మొక్కలు తొలగించడం, బావులు, అపరిశుభ్రమైన కుంటలు, మడుగులను శుభ్రపర్చాల్సిన బాధ్యత పంచాయతీ సర్పంచ్‌లపై ఉంది.

* వివిధ రకాల పన్నులను విధించి వసూలు చేయాలి అనుమతుల్లేని ప్రకటనలు తీసివేసే అధికారం, ఆక్రమణలు తొలగించే అధికారం ఉంది.
* ఎరువు వనరుల సంరక్షణ, కంపోస్టు తయారీ, ఎరువుల విక్రయాలు పర్యవేక్షించాలి.
* గ్రామ పంచాయతీస్థాయిలో వనరుల ప్రణాళిక రూపొందించుకోవాలి.

సర్పంచు గుర్తుంచుకోవాల్సినవి--
* పంచాయతీలో నెలరోజుల లోపు ఖాళీగా ఉన్న ఉపసర్పంచి పదవి ఎన్నికకు ఏర్పాట్లు చేయొచ్చు,
* పంచాయతీ రికార్డులన్ని సర్పంచి పరిశీలించవచ్చు. పంచాయతీ, కమిటీ ఆమోదంతో తీర్మానాలు అమలు కార్యనిర్వహణ అధికారికి ఉంటే ఆయనపై సర్పంచి పరిపాలనకు సంబంధించిన అజమాయిషీ ఉంటుంది.

* గ్రామాభివృద్ధి అధికారి నుంచి అవసరమైన సమాచారం తెప్పించుకోవచ్చు.
* సెక్షన్‌ 16-20 ప్రకారం సభ్యుడు ఎవరైనా అనర్హతకు గురైతే ఆ విషయాన్ని సర్పంచి జిల్లా పంచాయతీ అధికారికి సమాచారం ఇవ్వాలి.

ఆదాయం ఇలా--
* 13వ ఆర్థిక సంఘం, సాధారణనిధి, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు మూడు విభాగాలుగా ఆదాయం సమకూరుతుంది. ఇందులోనే ఇంటి పన్ను వసూలు, తలసరి ఆదాయం, వృత్తిపన్ను, చేపల చెరువుల వేలం, నీటితీరువా, కేబుల్‌ టివి ఫీజు, ఖాళీస్థలంపై సెస్సు, వ్యవసాయభూములపై విధించే పన్ను, గ్రంథాలయం పన్ను, లేఅవుట్లు రుసుం, వినోదపుపన్ను, భవన నిర్మాణాల ప్లాను, తదితర అంశాలపై ఆదాయం సమకూరుతుంది.

ఖర్చులులిలా--
* గ్రామపంచాయతీలో నిధులు మూడు ఖాతాల్లో ఖర్చు చేస్తారు. సాధారణ నిధి, ప్రత్యేక నిధి, వివిధ పథకాల నిధులుతో ఖర్చు చూపుతారు. వీటిలో సిబ్బంది జీతాలకు 30 శాతం, పారిశుద్ధ్యం 15 శాతం, వీధి దీపాలు 15 శాతం, నీటిసరఫరా 15 శాతం, రోడ్లు, డ్రైన్లు 20 శాతం, ఇతర అంశాలకు 5 శాతం ఖర్చు చేసే వీలుంది.

నిధుల వరద--
గత రెండేళ్లుగా ప్రత్యేక పాలన కొనసాగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు నిలిచిపోయాయి. 13వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ నిధులు అందనున్నాయి. నిలిచిన నిధులు మేజర్‌ పంచాయతీలకు రూ.12 లక్షల వరకు, మైనర్‌ పంచాయతీలకు 8లక్షల వరకు గరిష్టంగా సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అయిదు అంచెల పంచాయతీరాజ్‌ విధానం అమల్లో ఉంది. కేంద్రం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీల ద్వారా క్షేత్ర స్థాయికి నిధులు చేరుతున్నాయి.

Courtesy with Telugu News papers
  • =====================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment