పాలకొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం--పాలకొండ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల మన్ననలు పొందిన పి.జె.అమృతకుమారి (55) శనివారంతెల్లవారుజామున విశాఖపట్నంలోని కేఆర్‌ఎం కాలనీలోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు. కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈమె మృతిచెందారన్న విషయం తెలుసుకున్న నియోజకవర్గంలోని అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అమృతకుమారి భర్త వాసుదేవరావు 1998లో మృతి చెందారు. వీరికిలావణ్య, సౌజన్య, రవిచైతన్య పిల్లలు ఉన్నారు.
భర్త ప్రేరణతో రాజకీయాల్లోకి..
బీఏ, బీఈడీ వరకు చదువుకున్న అమృత కుమారి వంగర మండలం మడ్డువలస నీటిపారుదలశాఖలో 1980 నుంచి 1985 వరకు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఫుడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగైన తన భర్త వాసుదేవరావు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1985లో తొలిసారిగా కాంగ్రెస్ తరఫున పాలకొండ ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1989లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో జిల్లాలో ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 1989లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు రాష్ట్ర మహిళా సంక్షేమ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. 1994లో తెదేపా అభ్యర్థి తలే భద్రయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. 1999లో కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భద్రయ్యపై గెలుపొందారు. తెదేపా అనుబంధ సభ్యురాలిగా 2004 వరకు కొనసాగారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెదేపా తరఫున టిక్కెట్ దక్కకపోయినప్పటికీ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు విజయానికి కృషి చేశారు. 2009లో పాలకొండ శాసనసభ స్థానం ఎస్టీలకు కేటాయించడంతో పొరుగున ఉన్న రాజాం నియోజకవర్గంపై దృష్టి సారించారు. ప్రరాపా తరఫున టిక్కెట్ ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
పాలకొండ అభివృద్ధికి కృషి
పాలకొండ నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన అమృతకుమారి అభివృద్ధికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందారు. డివిజన్ కేంద్రమైన పాలకొండలో ఆర్టీసీ కాంప్లెక్సు, మెరుగైన విద్యుత్తు సరఫరాకు 132 కేవీ ఉపకేంద్రం, పాలకొండలో రక్షిత తాగునీటి పథకం నిర్మాణానికి కృషి చేశారు. సంతకవిటి-పొందూరు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. పాలకొండ పట్టణ శివారున ఉన్న శిథిలమైన పోతుల గెడ్డ ఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో సఫలమయ్యారు.
ఆ కోరిక తీరలేదు
విశాఖపట్నం నుంచి తిరిగి పాలకొండ వచ్చి తమ పిల్లలను రాజకీయాల్లో తీసుకురావాలనే కోరిక అమృతకుమారికి ఉండేదని ఆమె అభిమానులు చెబుతున్నారు. ఆ కోరిక తీరకుండానే మృతిచెందారు. అమృతకుమారి అంత్యక్రియలు పాలకొండలో ఆదివారం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
courtesy with Eenadu news paper
- =======================
No comments:
Post a Comment