ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం-1, 2 పలాస, టెక్కలి, పాలకొండ డిపోల్లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఎన్నికల్లో యూనియన్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. జిల్లాలోని ఐదు డిపోల్లో మొత్తం 2416 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నెక్ రీజియన్‌లో క్లాజ్-6 పొందేందుకు ఎన్‌ఎమ్‌యు ప్రయత్నిస్తుండగా, ఇప్పటికే క్లాజ్-6 గుర్తింపులో ఉన్న ఎంప్లాయిస్ యూనియన్ తిరిగి క్లాజ్-6ను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో నెక్ రీజియన్‌లో ఉన్న 9డిపోల పరిధిలో పోటాపోటీగా తమ ప్రచారాలు కొనసాగించాయి. కార్మికులను తమ యూనియన్ల వైపు ఆకర్షించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నాయి. అందులో భాగంగా కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చామంటూ ఏ యూనియన్‌కు ఆ యూనియన్ చెప్పుకొంటున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చింది మేమంటే మేమేనని కార్మికుల వద్దకు ఓట్లు అడిగేందుకు వెళ్తున్నారు. క్లాజ్-6 అర్హత సాధించాలంటే నెక్ రీజియన్‌లో 4272 ఓట్లకు గానూ 2137 ఓట్లు వస్తే నెక్ రీజియన్‌లో విజయబావుటా ఎగురవేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే నెక్‌రీజియన్‌పై ఎవరి అంచనాలు వారు వేసుకొంటున్నారు. పలాస, టెక్కలి, విజయనగరం, శృంగవరపుకోట, పార్వతీపురంలలో గెలుస్తామని ఇయు నాయకులు చెప్పుకొంటుండగా శ్రీకాకుళం-1, 2, టెక్కలి, సాలూరు, పలాసలలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామంటూ ఎన్‌ఎమ్‌యు నాయకులు దీమా వ్యక్తంచేస్తున్నారు. శనివారం ఉదయం 5 గంటలకు పోలింగు ప్రారంభమై సాయంత్రం 5గంటలతో ముగుస్తుంది. ఎన్నికలైన తర్వాత అర్ధగంట పాటు విశ్రాంతి అనంతరం లెక్కింపు ప్రారంభమై రాత్రి ఏడు గంటల సమయంలో మొదటి విడత ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వెళ్లే కార్మికుల జేబుల్లో సెల్‌ఫోన్ ఉండరాదు. యూనియన్‌కు ఒకరు చొప్పున ఏజెంట్ పోలింగ్‌బూత్‌లో విధులు నిర్వహిస్తారు. ఆయా డిపోల మేనేజర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తుండగా, కార్మికశాఖ కార్యాలయం నుంచి ఒక అధికారి ఎన్నికల నిర్వహణకు వస్తారు. క్లాజ్-6, రాష్ట్రస్థాయి గుర్తింపు ఎవరు పొందుతారో మరో 14 గంటల్లో ఫలితాలు తేలనున్నాయి.
Courtesy with Eenadu Srikakulam
- =======================
No comments:
Post a Comment