పురపాలక ఎన్నికలు మూడున్నరేళ్ల సుదీర్ఘ విరామం తరువాత..ఎన్నికల షెడ్యూలు సోమవారం 03-feb-2014 న విడుదలైంది. తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి కూడా అమల్లోకి వచ్చింది. శ్రీకాకుళం, రాజాం మినహా ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, పాలకొండ నగరపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. న్యాయస్థానంలో వివాదాలు పరిష్కారం కానందున శ్రీకాకుళం, రాజాం పట్టణాల్లో ఎన్నికలను నిర్వహించటం లేదు. వాస్తవానికి 2010 సెప్టెంబరు 29తో పాలకవర్గాలకు గడువు ముగిసింది. పాలకొండ నగరపంచాయతీ మాత్రం కొత్తగా ఏర్పడడంతో ఇదే మొదటి ఎన్నిక.
పార్టీ గుర్తులపైనే ఎన్నికలు జరగనున్నందున.. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే రాజకీయపక్షాలు రంగంలోకి దిగాయి. ఇంతవరకు సార్వత్రిక ఎన్నికలపైనే దృష్టి సారించిన నాయకులు.. ఇపుడు పట్టణాలపై పట్టు కోసం వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నామినేషన్లు ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నాయి. పురపాలికలపై పట్టు సాధించగలిగితే.. ఆ ప్రభావాన్ని సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగించవచ్చన్నది ఆయా పక్షాల వ్యూహం.
* ఎన్నికలు జరిగే పురపాలకసంఘాలు: ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ నగర పంచాయతీ
* ఎన్నికలు నిలిచిపోయినవి: శ్రీకాకుళం, రాజాం
* నామినేషన్ల స్వీకరణ: మార్చి 10 - 14,
* నామినేషన్ల పరిశీలన: మార్చి 15,
* నామినేషన్ల ఉపసంహరణకు గడువు: మార్చి 18,
* అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన,
* ఎన్నికలు: మార్చి 30
* రీపోలింగ్ ఉంటే: ఏప్రిల్ 1
* ఓట్ల లెక్కింపు: ఏప్రిల్ 2 అని మొదట నిర్ణయించినా దాన్ని 12-మే-2014 కి మార్పుచేసారు.
నాలుగు పురపాలకసంఘాల్లో ఓటర్లు: 1,13,300
పురుషులు: 56,212
మహిళలు: 57,075
ఇతరులు: 13
వార్డులు: 91
పోలింగు కేంద్రాలు: 109
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే ఫిర్యాదుల కోసం
* 1800 425 6625
*collector_sklm@gmail.com
*srikakulamcollectrate.com
ఇదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి
* ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుంది.
* కొత్తగా సంక్షేమ పథకాలు ప్రకటించడం, అమలు చేయకూడదు.
* అధికారుల నియామకాలు, బదిలీలు చేపట్టకూడదు.
* ప్రభుత్వ అతిథి గృహాలు, విశ్రాంత గృహాలను కేటాయించకూడదు.
* ప్రజాప్రతినిధుల పర్యటనలకు సదుపాయాలు కల్పించకూడదు.
* ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సంక్షేమ పథకాలు పంపిణీ చేయకూడదు.
* అనుమతి లేకుండా హోర్డింగులు, ఇతర వాటిని ఏర్పాటు చేయకూడదు. ఇప్పటికే ఉన్న వాటిని తక్షణం తొలగించాలి.
* జాతుల మధ్య మత, భాషాపరమైన ఉద్రేకాలు కలిగించే కార్యకలాపాలు చేయకూడదు
* ఎన్నికల ప్రచారం కోసం దేవాలయాలు, మసీదులు, చర్చలు మరే ఆరాధనా ప్రదేశాలను వేదికలుగా ఉపయోగించుకోకూడదు.
* ఓటర్లకు లంచం ఇవ్వటం, బెదిరించటం చేయకూడదు,
* అభ్యర్థులు నిబంధనలకు లోబడి ఖర్చు చేయాలి,
పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పాలకొండ పట్టణాల్లో 91 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కౌన్సిలర్లు ఛైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. నాలుగు పట్టణాల్లో 1,13,300 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు. వీరి కోసం 109 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చాలాచోట్ల సాధారణంగా ఒక వార్డుకు ఒక పోలింగు కేంద్రాన్నే ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల మాత్రం మహిళలు, పురుషులకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలాసలో 20 వార్డులు ఉండగా ఇప్పటికే 40 పోలింగు కేంద్రాలను గుర్తించారు. అదనంగా మరో ఏడు పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రతిపాదించారు. ఆమదాలవలసలో 7, 8, 16 వార్డుల్లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* పలాస - కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో ఇంతవరకు 2002, 2007 సంవత్సరాల్లో ఎన్నికలు జరిగాయి. రెండుసార్లూ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అధ్యక్ష స్థానాన్ని జనరల్‌కు కేటాయించటంతో వివిధ వర్గాల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. వార్డుల అభ్యర్థుల ఎంపిక కోసం ఆయా పార్టీల నాయకులు సోమవారం కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా తెలుగుదేశం, వైకాపా తరపున పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తిగా ఉన్నారు. ఇటీవలే వైకాపా నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీలు డాక్టరు కె.విశ్వనాధం, హనుమంతు అప్పయ్యదొర సైతం తమ సొంత వర్గాన్ని తయారు చేసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పరంగా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు.
* తెలుగుదేశం అభ్యర్థుల ఎంపిక కోసం ఆ పార్టీ పలాస నియోజకవర్గ బాధ్యుడు గౌతు శ్యామసుందర శివాజీ తన అనుచరులతో పలాసలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పలువురు కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. జీడి వ్యాపారుల సంఘ అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు, పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు ఎల్.కామేశ్వరరావుతో పాటు కె.పూర్ణచంద్రరావు అధ్యక్ష పదవికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. తొలుత అభ్యర్థుల ఎంపిక జరిగాక తర్వాత ఆలోచిద్దామని ఎక్కువమంది కార్యకర్తలు సూచించారు.
* వైకాపా తరపున ఒక వైపు ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, మరో వైపు పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు తమతమ అనుచరుల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యే వర్గం నుంచి మాజీ కౌన్సిలరు బోర చంద్రకళ, బోర కృష్ణారావు అధ్యక్ష పదవి ఆశిస్తుండగా వజ్జ బాబూరావు వర్గం నుంచి పురపాలక సంఘ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు బి.గిరిబాబు సిద్ధమవుతున్నారు. జగన్నాయకులు, బాబూరావు తమతమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో వైపు ఇదే పార్టీ నుంచి మాజీ కౌన్సిలర్ డి.శ్రీకాంత్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు.
* పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన చార్టెడ్ అకౌంటెంట్ పి.వి.సతీష్ తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన మాజీ ఎంపీ డాక్టరు కె.విశ్వనాధం అనుచరుడు.
-----------------------------------------
ఇచ్ఛాపురం పురపాలక సంఘం :
ఇచ్ఛాపురం పురపాలక సంఘ అధ్యక్షురాలి పదవి కోసం అపుడే పోటీ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల తరువాతే పురపాలక ఎన్నికలు ఉంటాయన్న ఉద్దేశంతో.. ప్రధాన పక్షాలు దీనిపై దృష్టి సారించలేదు. కానీ.. పుర ఎన్నికలే ముందుకు రావటంతో.. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇచ్ఛాపురం ఛైర్‌పర్సన్ పదవిని వెనుకబడిన తరగతుల వర్గ మహిళకు కేటాయించారు. గత నాలుగు పాలకమండళ్లలో మూడుసార్లు మహిళలే మహరాణులయ్యారు. గతంలో రెండు ప్రధాన పక్షాల మధ్యనే పోరు ఉండేది. ఇపుడు త్రిముఖ పోటీకి అవకాశం ఉంది.
సామాజికవర్గం, బంధుగణం, డబ్బు ప్రధాన పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిజర్వేషన్ల మేరకు అనుకూల వార్డుల అన్వేషణలో నాయకులున్నారు. గత పరిస్థితి చూస్తే.. గతంలో నాలుగు పాలకవర్గాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ అభ్యర్థులు మూడుసార్లు, తెలుగుదేశం అభ్యర్థి ఒకసారి పగ్గాలు చేపట్టారు. 1986-87లో పురపాలకసంఘంగా ఆవిర్భవించిన ఇచ్ఛాపురంలో ఇచ్ఛాపురంతో పాటు రత్తకన్న, ఎ.ఎస్.పేట పంచాయతీలను విలీనం చేశారు.ఆశావహులు ఇలా...ప్రస్తుత ఎన్నికల్లో అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని పక్షాల్లోనూ పోటీ ఉంది. కాంగ్రెస్, వైకాపాలకు మాజీ ఎమ్మెల్యేలు అండగా ఉండగా, తెలుగుదేశం పార్టీకి మాత్రం తాజా నాయకులే వ్యూహరచయితలుగా ఉన్నారు.
* తెలుగుదేశం తరఫున అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మాజీ ఛైర్‌పర్సన్ కాళ్ల వెంకటలక్ష్మి, పట్టణ పార్టీ అధ్యక్షుడు కాళ్ళ ధర్మారావు కుమార్తె నర్తు కవిత, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు చాట్ల తులసీదాస్ సతీమణి సుజాత, పట్టణ పార్టీ మహిళాధ్యక్షురాలు ఆశి లీలారాణి, పట్టణ పార్టీ కార్యదర్శి గుజ్జు జగన్నాధరెడ్డి సతీమణి గుజ్జు బాలామణి, మూడోవార్డు మాజీ కౌన్సిలరు, సాలిన రేవతి, రాష్ట్ర తెలుగు మహిళ ప్రతినిధి బుద్ధాల నిర్మలారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కాళ్ళ ధర్మారావు ప్రస్తుతం హైదరాబాదులో ఉండటంతో ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.
* కాంగ్రెస్ తరఫున మాజీ ఛైర్‌పర్సన్లు పిలక పద్మావతి, లాబాల స్వర్ణమణితో పాటు పట్టణ పార్టీ అధ్యక్షుడు కాళ్ల దేవరాజు సతీమణి కాళ్ల శకుంతలతో పాటు సీనియర్ పార్టీ నాయకులు, మూడుసార్లు పురపాలకసంఘ ఉపాధ్యక్షులుగా చేసిన ఉలాల బాలయ్య కుటుంబం నుంచి ఒకరు పోటీలో ఉండవచ్చునని తెలుస్తోంది.
* వైకాపాలో తొలి నుంచి పిలక పోలారావు పేరు వినిపిస్తోంది. బీసీ మహిళకు అధ్యక్ష స్థానం కేటాయింపు కావడంతో ఆయన కోడలు రాజేశ్వరి పేరు వినిపిస్తోంది. తాజా సమీకరణలతో మరికొన్ని పేర్లు బయటకొస్తున్నాయి. పార్టీ నాయకులు పిలక విజయ్‌కుమార్‌రెడ్డి సతీమణి ఈశ్వరి, దక్కత లోకనాధరెడ్డి సతీమణి, మాజీ కౌన్సిలర్ దక్కత లక్ష్మీభాయి, పరపటి కోటి సతీమణి మంజులత, సాలిన ఢిల్లీ సతీమణి సాలిన పద్మ, కొండా శంకర్‌రెడ్డి సతీమణి భారతి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో నాయకుని భరోసా లభించింది. ధర్మాన ప్రసాదరావు, నర్తు నరేంద్రయాదవ్, ఎం.వి.కృష్ణారావు, పిరియా సాయిరాజ్ తదితరులు తమ బలగాన్ని పెంచుకునేందుకు ఇదే అవకాశంగా మలచుకుంటున్నారని తెలుస్తోంది.
---------------------------------------------------
పాలకొండ పురపాలక సంఘం :
పాలకొండ నగర పంచాయతీ పోరులో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం నేడు12-05-2014న తేలనుంది. . పట్టణ ప్రజల్లో తొలి నగర పంచాయతీ పీఠాన్ని అధిష్ఠించేది ఎవరోనని జోరుగా చర్చ సాగుతోంది. పాలకొండ నగర పంచాయతీకి ఈ ఏడాది మార్చి 30న ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా కోర్టు తీర్పుతో ఫలితాలు వెల్లడివాయిదాపడింది . 20 వార్డులు ఉండగా, 14వ వార్డు ఏకగ్రీవమైంది. దీంతో 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 82 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎచ్చెర్లలో నిర్వహించనున్నారు. రెండు రౌండ్లలో ఓట్లు లెక్కింపు జరగనుంది. ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గంటలో ఫలితాల వెల్లడించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరగడంతో లెక్కింపు ప్రక్రియ సైతం సులభంగా, తక్కువ సమయంలోనే వెలువడతాయని అధికారులు చెబుతున్నారు. నగర పంచాయతీ కైవసం చేసుకోవాలంటే ఇరు పార్టీల(వై.ఎస్.ఆర్ & టి.డి.పి)లకు స్వతంత్రుల మద్దతు తప్పనిసరి. స్వతంత్రులు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీ నగర పంచాయతీని కైవసంచేసుకునే పరిస్థితి ఉంది.
నగర పంచాయతీలో అత్యధిక స్థానాలు తెదేపా కైవసం చేసుకుంటే ఆ పార్టీ తరఫున అధ్యక్ష పదవిని పల్లా విజయనిర్మల పీఠమెక్కనున్నారు. వైకాపా తరఫున అధ్యక్ష పదవికి మాజీ ఎంపీపీ పాలవలస ఇందుమతి పేరును ఆ పార్టీ ఖారారు చేసింది. ఆ పార్టీ తరఫున అభ్యర్థులు ఎక్కువ మంది విజయం సాధిస్తే ఇందుమతి అధ్యక్ష పదవి అధిరోహించనున్నారు.
మున్సి'పోల్స్'లో కీలక నామినేషన్ల ఘట్టం 20-03-2014 తో ముగిసింది. పది నగరపాలక సంస్థలు, 146 పురపాలక సంఘాల్లోని డివిజన్లు, వార్డుల సారథ్యానికి మొత్తం 21వేల పైచిలుకు అభ్యర్థులు బరిలో గిరిగీసి నిలవగా, ఈ నెల 30న బ్యాలెట్ సమరం సాగనుంది
- =========================
Visit my website - > Dr.Seshagirirao-MBBS.
No comments:
Post a Comment